కోల్ కతా నైటర్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ లో ఓ విచిత్రం జరిగింది. సన్ రైజర్స్ తరపున తొలిసారి బరిలోకి దిగిన శ్రీలంక యువ ఆల్ రౌండర్ కమిందు మెండిస్ ఓ అద్భుతం చేశాడు. ఒకే ఓవర్ లో రెండు చేతులతోనూ బౌలింగ్ చేశాడు కమిందు. 13వ ఓవర్ లో రెండో బంతిని లెఫ్ట్ హ్యాండరైన వెంకటేష్ అయ్యర్ కు కుడి చేత్తో బౌలింగ్ చేసిన కమిందు...తిరిగి అదే ఓవర్లో నాలుగో బంతిని కుడి చేత్తో బ్యాటింగ్ చేస్తున్న రఘువంశీకి ఎడమచేత్తో వేశాడు. అంతే కాకుండా ఆ బంతికి రఘువంశీ వికెట్ కూడా తీసుకున్నాడు. ఈ తరహా బౌలింగ్ చేస్తూ ఐపీఎల్ లో వికెట్ సాధించిన తొలి బౌలర్ గా నూ రికార్డులకెక్కాడు కమిందు మెండిస్. ఇలా రెండు చేతులతోనూ నైపుణ్యం కలిగి ఉండటాన్ని యాంబీడెక్ట్రాస్ అంటారు. తెలుగులో ఇంచుమించుగా సవ్యసాచి అనుకోవచ్చు. వీళ్ల రెండు చేతులకూ ఒకే తరహా సామర్థ్యం, నైపుణ్యం ఉంటుంది. ప్రపంచంలో ఇలా యాంబీడెక్ట్రాస్ అయ్యి రెండు చేతులతోనూ ఒకేలా పనిచేయింగలిగే నైపుణ్యం కలిగిన వారు కేవలం ఒక శాతం మాత్రమే ఉంటారట. అలాంటి ఒక శాతం మనుషుల్లో ఒకడే కమిందు మెండిస్. బ్యాటింగ్ లెఫ్ట్ హ్యాండ్ చేసే ఈ కుర్రాడు..20 బంతుల్లో ఓ ఫోరు, ఓ సిక్సర్ తో 27 పరుగులు కూడా చేశాడు సన్ రైజర్స్ కు. బ్యాటింగ్ లో స్విచ్ షాట్ ఆడే బ్యాటర్లను చూసి ఉంటాం కానీ ఇలా ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ చేయగల నైపుణ్యం బౌలర్లు అత్యంత అరుదు. లెఫ్ట్ హ్యాండ్ తో ఆడే బ్యాటర్లకు రైట్ హ్యాండ్ తో బౌలింగ్ చేస్తూ..రైట్ హ్యౌండ్ తో ఆడే క్రికెటర్లకు లెఫ్ట్ హ్యాండ్ తోబౌలింగ్ చేసే అలవాటున్న ఈ 26ఏళ్ల కుర్రాడు శ్రీలంకకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ ఆడేస్తున్నాడు. ప్రస్తుతం లైమ్ లైట్ లో క్రికెటర్లలో ఈ తరహా సవ్యసాచి బౌలర్ అయితే కమింద్ మెండిస్ మాత్రమే ఉన్నాడు. అందుకే 18సంవత్సరాల చరిత్ర ఐపీఎల్ లో ఇలా బౌలింగ్ చేసిన తొలి ఆటగాడిగా నిలవటమే కాదు వికెట్ కూడా తీసి చరిత్ర సృష్టించాడు కమిందు మెండిస్.